మా ఊరి దసరా

మా ఊరి దసరా

మా ఊరి దసరా
Comments

Written by Narsimha Reddy

అమ్మకూ బిడ్డకూ… పేగుబంధం.
సొంత ఊరికీ .. మనకూ… జ్ఞాపకాల గంధం
అది ఇగిరిపోని( ఇంకిపోని) గంధం.
కంటితడి తగిలితే చాలు,
మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.

అది దసరా. మా ఊరి దసరా. అచ్చంగా మా దసరా.

అమ్మ ఎవరికైనా అమ్మే.
సొంతూరు మీకైనా నాకైన ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురైనా… చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఊరి బాట పట్టాం నేనూ, మా తమ్ముళ్లూ.
ఈ గాలి, ఈ నేల , ఈ ఊరు , సెలయేరుా, … మముగన్న మా వాళ్ళు, మా కళ్ళ లోగిళ్ళు…

ఉఫ్!
ఎంత అందమైన భావన. కళ్లాలు విప్పుకున్న గుర్రాల మీద , రెక్కలు తెరుచుకున్న ఊహల పైన వడివడిగా వెడుతున్నాం…
ఎందుకంత తొందర అంటారా…!!!!

అది దసరా, మా ఊరి దసరా … అచ్చంగా మా దసరా…..
దసరా కేవలం పండుగ కాదు ..
అది ఎన్నో అనుభూతుల్ని బ్రతికి ఉన్నంత వరకు జ్ఞాపకాలుగా అందించే మరపు రాని విశేషాల ఖజానా…
మా చిన్న తనంలో..ఆ రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం. వారం రోజుల ముందే మా “కానిగి”(ప్రైవేట్) స్కూల్ టీచరు “అయ్యోరు పంతులు” వెదురు బద్దలతో బాణాలను తయారు చేసి, వాటికి రంగు రంగుల కాగితాలు అతికించి, పొడవాటి బాణాలకు అడివిలో తిరిగి పట్టు పురుగుల కాయల్ని తెచ్చి, కోసి వాటిని తగిలించి సిద్ధం చేసి, ఆయన నిష్ఠగా ఒక విశ్వామిత్రులుగా, ద్రోణాచార్యులుగా మారి మమ్మల్ని, రామ పరివారంలా, కురుపాండవ శిభిరంలా మార్చి ..
“అయ్యవారికి చాలు ఐదు వరహాలు..
పిల్లవాళ్లకి చాలు పప్పు బెల్లాలు” అనే పాటలు నేర్పించి ఇల్లిల్లు తిప్పేవారు, ప్రతి ఇంట్లో పిల్లలకు ఏవో తిను బండారాలు పెట్టేది.

మా స్కూలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండేది.
ఉదయం వెళ్ళగానే అందరం చేతులు కట్టుకుని నిలబడి నిన్నటి లెక్కల ఎక్కాలను, పద్యాలను, ఒకరి తరువాత ఒకరు చదువుతుంటే వెనకాల అందరూ కోరస్ గా చెప్పేవాళ్ళు. మా లెక్కల ఎక్కాలు తెలుగు లో 1 వ ఎక్కం నుండి 100 వ ఎక్కం వరకు ఉండేది. అవి నేర్చుకుంటే క్యాల్కులేటర్ అవసరం లేదు. వాటికి ప్రతి పది ఎక్కాలకు ఒక పేరుండేది. పావులు, అడ్దెలు, పోనెలు, దీడీలు అని పేర్లు ఉండేవి. “దీడీలు” నేర్చిన వాళ్ళను ఊరంతా చాలా గొప్పగా, గౌరవంగా చూసేవారు. అలాంటి క్రమశిక్షణ కలిగిన (టీచర్) గురువు దగ్గర మేము నీతి శతకాలు(సుమతి శతకం, వేమన శతకం, నరసింహ శతకం, భాస్కర శతకం) అన్నీ నేర్చుకున్నాం.

ఊరిలో వారందరూ తరతమ భేదాలు లేకుండా కొత్త బట్టలు కుట్టించుకునే పండుగ ఈ దసరా.కేవలం ఈ పండుగకి మాత్రమే ఊర్లోని బట్టలు కుట్టే “మేర” కులస్తులు, కొంతమంది “తురకలు” (ముస్లింలు) ఇండ్ల దగ్గర సందడే సందడి, వారు రాత్రి పగలు శ్రమించి ఊరందరికీ సరిపడే బట్టలు కుట్టేవారు. మా ఇంట్లో అందరి బట్టలకి, ఉదయం 11 గంటలకి శమీ వృక్షపు కొమ్మలతో సహా మా బట్టలను ఒక పీఠం పై పెట్టి పూజ చేసి సాయంకాలం “జంబి” కి వెళ్ళేటప్పుడు కట్టుకునే వాళ్ళం, అలా దసరాకి మేమందరం సిద్ధమయ్యేది.

పిల్లలందరం అలా కొత్త బట్టలు కట్టుకుని బజార్లు తిరుగుతూ… ఈ సంవత్సరం ఎవరు కట్టుకున్న బట్టలు బాగున్నాయోనని, “వాడిది బాగుందంటే … వీడిది బాగున్దంటూ ..” “మార్కులు” వేసుకునేవాళ్ళం. ఆ బట్టలు ఎవరు కుట్టారో తెలుసుకుని, వచ్చే సంవత్సరం మా బట్టలు కుట్టడానికి ఆ “దర్జీ” (టైలర్) దగ్గరకి వెళ్ళేవాళ్ళం.

ఇక ఆ రోజు సాయంత్రం అవుతుందంటే ఉత్సాహం పెరిగి పోయేది. పొలాలకు పనులపై వెళ్ళినవారు, పశువులకు గడ్డిని కోయడానికి వెళ్ళినవారు, గోజలు (పశువులు) మేపడానికి వెళ్ళినవారు, కలుపులు తీయడానికి వెళ్ళినవారు ఒకరేమిటి అందరూ సాయంత్రం ” డప్పుల” శబ్ధం కాగానే పరుగు పరుగున, తమ తమ ఇండ్లకు చేరి, కాల్చేతులు కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని, కొందరు అత్తరు పన్నీర్లు చల్లుకుని, చిన్న చిన్న ఆడపిల్లలు పట్టు లంగాలు వేసుకుని, పడుచు పిల్లలు లంగా ఓణీలు వేసుకుని వారి వారి ఇండ్ల ముందర నిలబడి అందరినీ పలకరించేవారు. వారు వారు కట్టుకున్న దుస్తుల్ని ఒయ్యారాలు పోతూ ప్రదర్శించేవారు. అయితే దసరా ” జంబీకి” ఎక్కువ మట్టుకు మగ పిల్లలు , మగవారు, పెద్దవారు మాత్రమే వెళ్ళేవారు, ఆడవాళ్ళు వచ్చేవారు కాదు.

అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో
అవాంతరాలు ఎదురయినా….చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఊరి బాట పట్టాం నేనూ, మా తమ్ముళ్లు.(నా)

జనమంతా “హనుమాoడ్ల ” కాడ (In front of Hanuman temple)
గుమి గూడినంక ఊరిపెద్ద మనుషులు, పని పాటల వాళ్లు ( వీళ్ళంతా కులపరంగ వారు వారు చేసే పనులు వల్ల వచ్చిన వృత్తి పరంపర) కలిసి ఊరేగింపు గా, మా ఇంటికి వచ్చేవారు. అప్పటికే మా ఇంట్లో సిద్ధం చేసి ఉంచిన “జెండా బట్ట”ను నియమ నిష్టలతో ఊరేగింపుగా గ్రామ దొడ్డి పైకి చేర్చి, ఒక పెద్ద జెండా కర్రకు కట్టి “విజయ పతాక” గా ఎగురు వేసేవారు. ఆ జెండా బట్టను ఒక చేనేత కార్మికుడు నేసి ఇచ్చేవారు..మరొక దర్జీ దాన్ని అందంగా కుట్టేవారు.

ఆ జెండాలో అర్ధ చంద్రుడు, చుక్కలు చక్కగా అమర్చేవారు, దానిని పలంచ గంగారాం (ఊరందరి కోసం పని చేసే కాందార్) మా ఇంటికి చేర్చి, దానిని బీర పూవులతో తీసిన “పసరు” లో అద్దేవారు. దానితో ఆ జెండా గుడ్డకు లేలేత పసుపు కాస్త ఆకు పచ్చ రంగు అబ్బేది. ఒక ” సుగంధం” అంటుకునేది. అలా ఆ జెండాను ఎగురవేసి, దొడ్డి మైసవ్వకు కొబ్బరి కాయలు కొట్టి, ఆ తరువాత ఊరి పెద్దకాపు ఇంటికి దప్పులు బాజాలతో వెళ్లి , వారింట్లో చేసిన నైవేద్యాలను తెచ్చి ఇక్కడ మైసమ్మ అమ్మవారికి సమర్పించేవారు.

ఆ తరువాత “బలి” కార్యక్రమం, ఇది అక్కడికి చేరిన అందరిలో పూనకం వచ్చినంత పనిజెసేది.ఆ రోజున కురుమలు ఒక గొర్రెను ఊరి మీదికి ఇచ్చేవారు.ఆ గొర్రెను బలికి సిద్ధం చేసి పసుపు కుంకుమలు, కంకణాలు కట్టి దాని నోట్లో “కల్లు ” పోసి, నిప్పుల పై గుగ్గిలము (సాంబ్రాణి) వేసి పొగబెట్టి, అమ్మ వారి ముందు పూజకట్టి నిలబెట్టేవారు. “జడితి” ఇస్తే గాని “బలి” ఇచ్చేవారు కాదు.

మొదట దానికి పెదకాపు ఆపై మా పెదనాన్న, లేదా నేను(మా నాన్న ఎందువల్లనో కార్యక్రమానికి వచ్చేవారు కాదు) అందుకని ఇంటికి పెద్దవాన్ని కనుక (చిన్న పిల్లవాడిని అయినా) ఆచారం ప్రకారం నాతో ఆ క్రతువు చేయించేవారు, ఆపై గ్రామ పెద్దలు ఇలా ఆ గొఱ్ఱె జడితి ఇచ్చేవరకు అందరి చేత మొక్కుపిచ్చి, పూజ కట్టేవారు. ఆ సందర్భంగా దాదాపు ఎనిమిది మంది డప్పులు, బాజాలు వాయించేవారు.

డప్పుల శబ్ధం అందరినీ “సిగము ఊగించేది”. బలి ఇచ్చేముందు డప్పుల చప్పుడును ” సిగం డప్పు” అనేవారు.ఆ శబ్దానికే బహుశా గొర్రె జడితి ఇచ్చేది. అప్పటికే సిద్ధంగా ఉంచిన “సిబ్బిలో” (ఒక గంప) దాన్ని పడుకోబెట్టి కాళ్ళు కట్టి, ఒక మొద్దు పై దాని తలను ఆనించి, పలంచ పెద్ద గంగారాం, మా అందరి అనుమతి తీసుకుని, అమ్మవారికి మొక్కి “ఒకే ఒక్కవేటు” తో దాని తలను నరికి మొండెంతో వేరు చేసేవారు. అది చిమ్మిన రక్తాన్ని అక్కడున్నవారందరు “తిలకం” గా ధరించే వారు.

( ఆ పిమ్మట ఇది ఎంత దారుణమైన, కిరాతకమైన పనో అని గుర్తించి 2012 నుండి మాని వేసి, గుమ్మడి కాయను “బలి” ఇస్తున్నారు.) ఇది ముగియగానే మళ్ళీ అందరూ ఊరేగింపుగా మా ఇంటికెళ్లి, అక్కడ మా అమ్మ సిద్ధం చేసిన “జంబి”, పూజా వస్తువులు, ” దఫ్త్రం” మరియు పెద్ద ” కరవాలం” (తల్వార్) లు తీసుకుని ఊరిబయట నాటి ఉంచిన “జంబి” వృక్షం దగ్గరికి ( ఒక జంబి చెట్టు కొమ్మని ఆ స్థలంలో తాత్కాలికంగా నాటేవారు) వెళ్ళేవాళ్ళం. ఊరు ఊరంతా ఉత్సాహంగా కదిలి వచ్చేవారు.

ఈ శమీ పూజను, మా పెదనాన్న విఠల్ రెడ్డి గారు ప్రధానంగా నిర్వహించేవారు. వారికి వీలుకానప్పుడు మా నాన్నగారు, అలా పరంపరగా కొన్ని సంవత్సరాలుగా నేను, (మేము ఊరు వదిలినంక మా నాన్న గారి శిష్యులు కారోబార్ గంగాధర్) నిర్వహించేవారు. ఇప్పుడది ఇందూరు – తిరుమల ఆలయంలో ప్రత్యక్షంగా నాటిన శమీ వృక్షానికి ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. పుజకాగానే ఆ కరవాలంతో ఒక కొమ్మని మా పెదనాన్న నరికే వారు. ఇక ఆపై అక్కడున్న బలిష్టులైన యువకులందరూ ఒకేసారి దానిపైబడి గుంజుకొని ఉరికే వారు. ఇక అక్కడి నుండి మా ఇంటి వరకు కొనసాగే ఊరేగింపును చూసి తీరవలసిందే. మండల బాలయ్య, మాల భూమయ్య, శివునాశిపల్లి కర్రన్న, బక్కన్న, ఎర్రన్న, బండి సాయిలు, నీరెడు పోశెట్టి, కాపోల్ల లక్ష్మణ్, చిన్నోళ్ల రాములు…. ఇలా వీళ్ళంతా అద్భుతంగా కట్టే తిప్పేవాళ్ళు. ప్రత్యేకంగా శివునాశి పల్లి , నడిపి బాలయ్య , పాల సాయన్న “తల్వారు ” తిప్పేవారు. కొన్ని సార్లు వీళ్లను ఉత్సహపరచడానికి మా నాన్న తిప్పినట్లు గుర్తు. అలా అందరూ “హనుమాండ్ల కాడికి చేరి” ఆంజనేయునికి, శివునికి, మొక్కి అక్కడ ” జంబి” ఆకును “బంగారంలా” ఇచ్చుకుంటూ అభినందించుకునేవారు. మెల్లగా దప్పుల బాజాల ఊరేగింపు మా ఇంటికి చేరేది. అందరూ ఇంట్లోకి వచ్చి అరుగులపై పరిచిన జంబుఖానా , చాపలపై కూర్చునేవారు.అందరికీ అమ్మ ఒక తీపి పదార్థం, కరి శక్కెర బిల్లలు, పోకలు అందించేది.

ఊరంతా మా పెద్దనాన్న, పెద్దమ్మ బాపాయిలు,మా అమ్మానాన్నలకు అలా బంగారం ఇచ్చి పుచ్చుకుని, అభినందించుకుని ఆనందంగా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళేవారు.ఎంత రాత్రి అయినా ఇంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకునే వారు.
ఇప్పుడు ఏదీ…????!!!!!

తెరముందే మేం….మరి తెర వెనుక ! ! ! ఎవరు చేయిస్తున్నారివి………..?
మూల కారణంబెవ్వడు…….సర్వము తానెయైన వాడెవడు
అనాది మధ్యలయుడైనవాడు నడిపిస్తే……తడబాటు లేదు..ఎడబాటూ లేదు……!!!

Maapalle Meetup 2022, Narsingpally

Related Articles

మా పల్లె

మా పల్లె

అమ్మకు బిడ్డకు, 'పేగుబంధం’. సొంత ఊరికి మనకూ........ జ్ఞాపకాల గంధం.అది ఇగిరిపోని గంధం.కంట తడి తగిలితే చాలు,మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవోఅవాంతరాలు ఎదురయినా....చాలా కాలం తర్వాత కాలం...

మా పల్లె

మా పల్లె

మా పల్లె
Comments

Written by Narsimha Reddy

అమ్మకు బిడ్డకు, ‘పేగుబంధం’.

సొంత ఊరికి మనకూ…….. జ్ఞాపకాల గంధం.
అది ఇగిరిపోని గంధం.
కంట తడి తగిలితే చాలు,
మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.

అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో
అవాంతరాలు ఎదురయినా….చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఊరి బాట పట్టాం నేనూ, మా తమ్ముళ్లు.(నా)

ఈ గాలీ, ఈ నేలా, ఈ ఊరూ, సెలయేరూ.. మముగన్న మా వాళ్లూ, మా కళ్లలో లోగిళ్లూ … ఉఫ్‌ ! ఎంత అందమైన భావన. కళ్ళాలు విప్పుకున్న గుర్రాలమీద, రెక్కలు తెరుచుకున్న ఊహల పైన వడివడిగా వెడుతున్నాం… ఎందుకంత తొందరంటారా 1!!!

అది దసరా. మా ఊరి దసరా. అచ్చంగా మా దసరా.

చిర్రగోనె, బొంగరాలు, ఉర్రు, కాలికింది కట్టె, నక్కమూటి, గోటీలు, బావుల్లో ఈతలు ఎన్నెన్నో ఆటలు…!! కాలాన్ని గిరుక్కున వెనక్కి తిప్పితే ఎన్నెన్నో జ్ఞాపకాలు… ఏటి గట్లని, అడవి చెట్లనీ, పంట చేలనీ, పసుల మందనీ, వెండి వెన్నెల్నీ, వీధి నాటకాల్సి, శార్తకాల్ల కథల్ని, దొమ్మరి ఆటల్ని, భజన పాటల్ని అస్ప్సేదూల .. అలయబలయ్‌ పీర్ల పండగల్ని మంచెలెక్కడం, చిలకల్ని కొట్టడం, గిరక కొట్టడం, బెల్లం వండటం, పార, పలుగు, తట్ట, బుట్ట, సుత్తీ కొడవలి, నాగలి, బండి ,గ్యారె, కమ్మి, ఈత పండ్లు, జీడి పండ్లు, చిటిమిటి పండ్లు, తునికి పండ్లు, మొర్రి పండ్లు, మారేడు పండ్లు, ఇరికి పండ్లు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభూతులు… బచ్‌పన్‌కే దోస్తులు, బదలాయించని ఆస్తులు…

స్మూలుంటే.. చేతిలో పుస్తకాల సంచి, పెన్ను, పెన్సిళ్ళ డబ్బాతో పొరుగూరికి పొలాల గట్ల పైన
నడుస్తూ.. స్కూలు లేకుంటే చేతిలో పగ్గం, ముల్లుకట్టె, ముందర ఎడ్లూ, నాగళ్ళు. పల్లెపాటలు పాడుతూ .. అదో లోకం…

అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో
అవాంతరాలు ఎదురయినా….చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఊరి బాట పట్టాం నేనూ, మా తమ్ముళ్లు.

ఊహ తెలిసేసరికి ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం కూరుకుపోవడంతో, కష్టాలను ఈదుకుంటూ, అవమానాల్ని భరించుకుంటూ సాగుతున్న జీవితంలో ఎన్నో మజిలీల్ని దాటుతూ ఇప్పుడు ఒక గౌరవప్రదమైన మెట్టుపై నిలిచాక….. అంతరాంతరంలో మథనం… ఎందాకీ పయనం ! ఏమిటీ జీవితం !

మనిషిగా ఎందుకు పుట్టాం, ఏం సాధించడానికి ! ! ! తర్వాత తరాలకు మన జ్ఞాపకాలను పదిలంగా ఈ లోకంపై వదిలి వెళ్ళడం ఎలాగా ! మన బతుకు పండాలంటే, పరిమళాలు వెదజల్లాలంటే ఏం చేయాలి..? మనోఫలకం మీద అనేకానేక ప్రశ్నలు, అంతులేని తపన. కాలచక్రాన్ని రివర్స్‌గేర్‌లో పెడితే ఎన్నెన్నో మధురాతి మధురమైన స్పృతులు ఒక్కొక్కటిగా కళ్ళముందు కదలాడుతున్నాయి. డబ్బూ, ఇళ్ళూ, కార్లు, ఆస్తులు సంపాదించడానికేనా మనం పుట్టింది..? కానప్పుడు….. మరెందుకు?

జ్ఞాపకాల ప్రవాహాన్ని ఈదుకుంటూ మా ఊరికి చేరుకున్నాం. తీరా చేరుకున్నాక ఊర్లో దసరాని చూస్తే ఉన్న ఉత్సాహం ఆవిరైంది. ‘జంబీకి వంద మందికి మించి రాలేదు. ఏ కులమైనా మతమైనా ఊర్లో అందరం కలిసి సాయంత్రం శమీ పూజ నిర్వహించాక ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, కర్రసాము చేస్తూ, తల్వార్లు తిప్పుతూ ఊరేగింపుగా రావడం….. కళ్ల లోపలి పొరల్లోని స్త్రాంగ్‌ రూంలో భద్రంగా ఉంటే ఇప్పుడు… ఇదేమిటి.. ఇలా… కళ తప్పింది…కళ సరే..దారి కూడా తప్పామా ???

చిన్ననాటి స్నేహితుల్ని ఇలా ఎందుకని అడిగినప్పుడు – ఎవరికివారు ఇళ్ళలోనే ఉండి దావతులు చేసుకుంటున్నారని, బయటికి రావడం లేదని వారి నుంచి విన్నాక మనసులో చాలా బాధ కలిగింది. ఎందుకిలా మన సంప్రదాయాల్ని మరచి మనుషులందరం ఒంటరివాళ్ళం అయిపోతున్నామో అర్ధం కాలేదు. పట్నాల వాసనలు పల్లెల్ని కూడా కలుషితం చేసాయా..? పండగల పేరుతో అందరం కలిసి ఆనందాల్ని పంచుకునే పద్ధతులు మారిపోయాయా, మాసిపోయాయా? టెలివిజన్‌లు ఇళ్ళల్లో దూరి మనుషుల్ని నాలుగు గోడలకే పరిమితం చేసాయా..?

ఓ రోజు తిరుమల మెట్లు ఎక్కుతూ ఉంటే మనస్సంతా అలజడి……

ఏమిటీ సవ్వడి…ఎందుకీ అలజడి… ఇప్పుడన్నీ ఉన్నాయి కదా….పేరు, ప్రతిష్ట గుర్తింపు, గౌరవం….అయినా ఏదో వెలితి….ఏమిటది..? ఇది చాలదు బతకడానికి… మరి.. ఇంకేదో తపన.. కొండ మెట్లు ఎక్కుతూనే ఉన్నా,చెమట కక్కుతూ… మెల్లగా మెట్టుపై… మెట్టు.. అలా… అలా.. మెలమెల్లగా… ఎడారిలో చినుకులా… చిమ్మ చీకట్లో చిరు వెలుగులా…మా పల్లె… నేను పుట్టి పెరిగిన పల్లె…..నన్ను లాలించిన పల్లె, నన్ను మురిపించిన పల్లె….మా ఊరు.. మా నర్సింగపల్లె..

నిజామాబాద్‌కు కూతవేటు దూరంలో కల్మషం, కాలుష్యం అంటే తెలియని ఆ పల్లె… మసక మసక గీతలా మొదలయి కృష్ణ గీతలా, ఓ ముత్తయిదువులా.. మళ్ళీ కళ్ళముందు బేలగా… మా అమాయకపు పల్లె…. ఔను !!! ఆ పల్లెకు ఏదో ఒకటి చేయాలి… అదే నా జీవితంలో ఉత్కృష్టమైన కార్యం కావాలి….

వెంటనే తమ్ముళ్ళు – దిల్‌ రాజు, శిరీష్, సింహంల ముందు… నా బాధను వెల్లగక్కాను.

మళ్ళీ దసరా తర్వాత ఓ రోజు ఊరికి బయల్దేరా……ఊరివారందర్నీ పోగు చేసి….ఇలా ఎందుకు జరుగుతోంది, మన తరువాత తరం వారికి మన సంప్రదాయాలు, కుటుంబ విలువలు ఎలా అందజేయాలి అనే ప్రశ్నలతో సమాలోచనలు చేసా. ఇకపై అందరం కనీసం ఒక్క దసరా పండగకైనా కలుసుకోవాలని నిర్ణయించాం. ఇకపై మే౦ ప్రతి దసరాకి ఎక్కడున్నా కచ్చితంగా ఊరికి వస్తామని అలాగే మీరందరూ కూడా పాల్గొనాలని గ్రామస్తులందరిని ఒప్పించి తీర్మానించాం. అలా మళ్ళీ మా ఊర్లో పండగలకి అందరితో కలిసి పాల్గొనే సత్స౦ప్రదాయానికి తెరదీసాం.

సొంత ఊరికీ మనకూ…………. జ్ఞాపకాల గంధం. అది ఇగిరిపోని గంధం. కంటి తడి తగిలితే చాలు, మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.

అదే ఈ గ్రంథం. ఇది ఊహల గంధం కాదు…… పెల్లుబికిన ఉత్సాహాల బంధం కాదు, వాస్తవాల గ్రంథం. కాలికి బలపంగట్టుకుని తన చరిత్రను తానే వల్లెవేసుకుంటున్న గ్రంథం.

తెరముందే మేం….మరి తెర వెనుక ! ! ! ఎవరు చేయిస్తున్నారివి………..?
మూల కారణంబెవ్వడు…….సర్వము తానెయైన వాడెవడు
అనాది మధ్యలయుడైనవాడు నడిపిస్తే……తడబాటు లేదు..ఎడబాటూ లేదు……!!!

Maapalle Meetup 2022, Narsingpally

Related Articles

మా పల్లె

మా పల్లె

అమ్మకు బిడ్డకు, 'పేగుబంధం’. సొంత ఊరికి మనకూ........ జ్ఞాపకాల గంధం.అది ఇగిరిపోని గంధం.కంట తడి తగిలితే చాలు,మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.అమ్మ ఎవరికయినా అమ్మే. సొంతూరు మీకయినా నాకయినా ఒకటే. ఎప్పటికప్పుడు ఏవోఅవాంతరాలు ఎదురయినా....చాలా కాలం తర్వాత కాలం...